దనాడ్యుడి పరివర్తన
మాధవపురంలో ధనాఢ్యుడని ఓ వ్యాపారి
ఉండేవాడు. అతను పిసినారి. ఎంతలా అంటే ఊరి నుంచి వచ్చిన దగ్గరి బంధువులక్కూడా అతిథ్యం
ఇవ్వక ఏదో సాకు చెప్పి పంపించేవాడు. అంతేగాక అతను డబ్బులు వడ్డీకి ఇస్తుండేవాడు. అది
కూడా ఆ మాధవపురంలో ఎక్కడా లేని విధంగా ఉండేది. ఊరివారు ఏదయినా దైవకార్యం తలపెట్టి చందా
అడిగితే కూడా లౌక్యంగా వాయిదాలు వేస్తూ ఆ కార్యక్రమం అయింతర్వాత గానీ దొరికేవాడు. కాదు.
ప్రజలు అతని ప్రవర్తన వల్ల విసిగిపోయారు. అయినా అతను ధనవంతుడు గనుక అతన్ని గౌరవించేవారు.
సోముడు ఆ ఊళ్ళోనే చిన్న గుమస్తా. వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగాలేక వైద్యానికీ, మందులకూ
ధనాఢ్యుడిని కొంత సొమ్ము అప్పు అడిగాడు. తన దగ్గర లేవన్నాడు. సోముడు ప్రాధేయపడ్డాడు.
అయినా సరే ఇవ్వలేదు. సోముడికి ఉన్న రెండెకరాల పొలం తాకట్టుపెడితే గానీ డబ్బులు అప్పుగా
ఇవ్వనన్నాడు ధనాఢ్యుడు. అయిదు నెలల్లో తన డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే ఆ రెండెకరాల
పొలం తన సొంతం చేయాలనే షరతునూ కాగితం మీద రాయించుకున్నాడు.
పొలం దస్తావేజులు తీసుకొని సోముడికి అప్పు ఇచ్చాడు. అదీ సోముడు అడిగిన సొమ్ములో
సగాన్ని వడ్డీ కింద వేసుకుని. సోముడి తల్లికి వైద్యం మూణెల్లు సాగింది. తాను పొదుపు
చేసిన సొమ్ముతోపాటు ధనాఢ్యుడి దగ్గర తీసుకున్న అప్పు మొత్తం ఖర్చయిపోయింది. అయిదు నెలల
గడువు కాస్తా ముగిసిపోయింది. వడ్డీతో సహా అప్పు తీర్చలేకపోయాడు సోముడు. అప్పుడు ధనాఢ్యుడు..
సోముడి పొలాన్ని తన పరం చేయాలని ఒత్తిడి తేసాగాడు. ఆ పరిస్థితుల్లో సోముడు ఆ ఊళ్ళోని
పెద్ద మనిషి రామయ్యను కలిశాడు. అతనికి జరిగినదంతా వివరించాడు. సోముడిని ధనాఢ్యుడి వద్దకు
తీసుకునిపోయి అప్పు తీర్చేందుకు మరికొంత గడువు ఇవ్వమని కోరాడు రామయ్య. దానికి
ధనాఢ్యుడు ఒప్పుకోలేదు సరికదా సోముడు వేసిన పంట కూడా తానే తీసుకుంటున్నట్టు చెప్పేశాడు.
పంటనంతా తనపరం చేసుకున్నాడు.
గోపాలం అని ధనాఢ్యుడి దగ్గర పనిచేసే ఓ కుర్రాడు బీదవాడే గానీ మంచి మనసున్నవాడు..
సోముడి ఇంటికి దగ్గరగానే వుండేవాడు. సోముడికి మంచి మిత్రుడు కూడా. సోముడు, గోపాలం,
రామయ్యల మధ్య ఓ రహస్య సమావేశం జరిగింది. 'అయ్యా.. ఊరి చివర పాడుబడిన కోట దగ్గరకు ఓ
స్వామీజీ వచ్చాడు. అతనికి చాలా మహిమలున్నాయని ప్రజలంతా చెప్పుకుంటున్నారు' అని గోపాలం..
ధనాఢ్యుడి లోనున్న దురాశాపరుడిని మేల్కొలిపాడు. ఆ స్వామీజీకి 12 గంటల్లో ధనం, బంగారాన్ని
రెట్టింపు చేసే శక్తి వుందని, మంత్రాలన్నీ తెలిసిన మహిమాన్వితుడనీ, సమాజ శ్రేయోభిలాషనీ
నమ్మబలికాడు. వెంటనే కోట దగ్గర స్వామీ అభయానందను కలిశాడు ధనాఢ్యుడు. ముందరగా స్వామీజీ
మహిమలను పరీక్షిద్దామనుకుని ఒక బంగారు గొలుసును పెట్టి మర్నాడు పొద్దున్నే వస్తానని
సెలవు తీసుకొని ఇంటికొచ్చాడు. అంతే ఆ రోజు నిద్రపోకుండా అటూ ఇటూ దొర్లి పొద్దున్నే
స్వామీజీని కలిశాడు. స్వామీజీ అతడికి రెండు బంగారు గొలుసులను ఇచ్చాడు. అలా మళ్లీ ఆ
రెండు 'బంగారు గొలుసులు పెట్టుబడిగా పెడితే నాలుగయ్యాయి స్వామీజీ దగ్గర. అంతే! ఓ మూటలో
బంగారం, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, నగదునూ స్వామి దగ్గర పెట్టేసి యాడు ఇంటికి తిరిగివెళ్లి
హాయిగా నిద్రపోం ధనాఢ్యుడు. పొద్దున్నే ఉత్సాహంగా గుర్రపు బగ్గీలో బయలుదేరాడు స్వామీ
అభయానందను కలవడానికి. స్వామీజీ ఆశ్రమం దరిదాపుల్లో కనిపించలేదు అతనికి. ఆ మోసం ధనాఢ్యుడిని
కుంగదీసింది. ఇప్పుడు ధనాఢ్యుడు తాను చేసిన పనిని ఎవరికీ చెప్పుకోలేడు. కానీ అత్యాశకూడదనీ,
వీలైనంత వరకు ఇతరులకు సహాయపడాలనీ గ్రహించాడు. సోముడి పొలాన్ని సోముడికి తిరిగి ఇచ్చేశాడు.
శేష జీవితాన్ని సమాజశ్రేయస్సుకే అంకితం చేశాడు.
Written by,.... డా. చిట్యాల రవీందర్.
0 Comments