#popad code #popad code క్రైమ్ స్టోరీ.... ఆమె కధ

Ad Code

Responsive Advertisement

క్రైమ్ స్టోరీ.... ఆమె కధ

ఆమె కధ,.. 

 “మా తల్లి మా తల్లే.

ఇంకో ముద్ద తినమ్మా.” అంటూ ఐదు సంవత్సరాల చిన్నారి చుట్టూ కొసరి కొసరి అన్నం తినిపిస్తోంది చిన్నారి వాళ్ళ చినత్త సులోచన.

“తాలు. నాతోద్దు. తిన్నత్త” (చాలు.నాకొద్దు.చినత్త)

అంటూ ముద్దుగా వచ్చీ రాని మాటలతో ముద్దు ముద్దుగా పలుకుతోంది చిన్నారి శరణ్యం.

“ఇంకొంచెం ఇదిగో ఇదే చివరి ముద్ద” అంటూ గిన్నెలోంచి చివరి ముద్దను తీసేలోపు ఇంట్లో నుండి వేగంగా పెరట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి చిన్నారి చేతిని పట్టుకుని గబ గబా వీధిలోకి పరుగుతీసాడు 6 సంవత్సరాల పార్థు.

“రే నానా పార్థు. ఆగరా. కాస్త మంచినీళ్లు తాగించాలి “

అంటూ తల కొట్టుకుని, ఇంట్లోకెళ్లి మంచినీళ్ళ గ్లాసుతో వీధిలోకొచ్చి పిల్లల మధ్యలో పార్థు చేయి పట్టుకుని ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకెళ్లి గ్లాసుతో నీళ్లు తాగించింది సులోచన.

అప్పుడే అటుగా వచ్చింది అమృత. సులోచన తమ్ముడి భార్య. ఈమధ్యనే కొత్తగా పెళ్లయిన కొత్త పెళ్లికూతురు. చిన్నారిని చూసి దగ్గరకెళ్లి “అమ్మలూ. నాతో రా. మనం ఆడుకుందాం” అంది. ముద్దు చేస్తూ.

“లాను. పాతుతో ఆకొంత(రాను. పార్థు తో అడుకుంటా)” అంది ముద్దుగా.

“సరే. ఇవి తీసుకో అంటూ రెండు చాక్లెట్లు చిన్నారికిచ్చింది.

ఆ చాక్లెట్లు ఇష్టంగా తీసుకొంటూ “పాతుకు?”(పార్థు కు)అంది. క్వశ్చన్ మార్క్‌ఫేస్‌తో..

“ఇదిగో అంటూ.”ఇంకో చాక్లెట్ ఇచ్చింది.

సంతోషం గా వెళ్లిపోతున్నా చిన్నారిని దగ్గరగా తీసుకుంటూ పాలుగారే చిన్నారి బుగ్గలపై ముద్దు పెట్టి, అలాగే తన బుగ్గపై చిన్నారితో ముద్దు పెట్టించుకుంది అమృత.

ఇదంతా అక్కడే నిలబడి చూస్తున్న సులోచన “ఏం మరదలు పిల్లా. కొత్త పెళ్లికూతురా. ముద్దులన్ని చిన్నారికిచ్చేస్తున్నావ్. నా తమ్ముడి కోసం కూడా కొన్ని దాచి పెట్టుకో”. అంది ఆట పట్టిస్తూ.

“ఊరుకో వదినా. అక్కడికేదో మీ తమ్ముడికి తక్కువ చేసినట్టు “అంటూ నవ్వుతోంది.

“గడుసు పిల్లవే అమ్మాయ్ నువ్వు.”అంది అమృత చేతిలోంచి అరిసెలున్న బాక్స్ అందుకుంటూ.

“మరే. కాకపోతే మీ తమ్ముడు ఏమైనా అమాయకుడా వదినా… అంది ఆరా తీస్తూ.

“ఇద్దరూ ఇద్దరేలే. ఒకరికొకరు ఏమి తీసిపోరు” అంది నవ్వుతూ.

“నిన్నటి నుంచి చిన్నారి ఇంటికి వెళ్లలేదని అరుణ అక్క చిన్నారిని తీసుకు రమ్మని నన్ను పంపింది వదినా అంది అమృత”.

“అవునా అమృత. వదినకు కాలు బెణికింది అని విన్నాను. అమ్మ చెప్పింది. ఇప్పుడెలా ఉంది అంది సులోచన..


“పర్లేదు వదినా. డెలివరీ డేట్ దగ్గర ఉంది కదా. కాస్త ఇబ్బందిగానే ఉంది. పాపం.” అంది.


సులోచనకు ఒక అక్క.. పేరు సావిత్రి. ఆవిడ పెళ్లి చేసుకోలేదు. రైల్వేలో జాబ్ చేస్తోంది. బెంగళూర్లో ఉంటోంది. ఒక అన్న శివకృష్ణ, వదిన అరుణ. అన్న కాంట్రాక్టర్. రియల్ ఎస్టేట్ బిజినెస్. వారికి ఒక పాప శరణ్య. ముద్దు పేరు చిన్నారి. ఇప్పుడు అరుణ కడుపుతో ఉంది. తొమ్మిదో నెల. ఒక తమ్ముడు అవినాష్. అవినాష్‌కు ఈ మధ్యనే కొత్తగా పెళ్లయింది. అవినాష్ భార్య అమృత.


ఇక సులోచన తల్లి లక్ష్మి .తండ్రి రఘురామయ్య. పొలాలు ఎక్కువ. వ్యవసాయం చేస్తూ, చేయిస్తూ గడిపే ప్రశాంత జీవనం వారి సొంతం.


సులోచన పెద్ద చదువులు చదివింది. కానీ సులోచన భర్త విశ్వనాథ్‌కు భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోవడం వలన గృహిణిగా ఉండిపోయింది. విశ్వనాథ్‌గారు స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్. వారి కొడుకు పార్థు.


ఇప్పుడు సులోచన మూడో నెల గర్భవతి. ఆ కుటుంబం ఒక నందనవనం. ఆనందాల హరివిల్లు.

అప్పుడే ఇంట్లోకి వచ్చాడు పార్థు.

“చిన్నారి ఎక్కడరా.. ఒక్కడివే వచ్చావు” అంది సులోచన



“మామయ్య వెళ్తుంటే మామయ్య తోటి వెళ్లిందమ్మా” అన్నాడు పార్థు.



“సరేలే. నువ్ కూర్చో అమృతా” అంటూ ఇద్దరికి కాఫీ కలుపుకొచ్చింది సులోచన. కాఫీ తాగుతూ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోయారు.


పార్థు, చిన్నారి ఇద్దరు ఒకే స్కూల్. కలిసి వెళ్లడం. కలిసి రావడం.. ఆటలు.. చదువు.. అన్నింట్లో కలిసి మెలిసి ఉండేవారు.


చిన్నారికి తమ్ముడు పుట్టాడు. పార్థుకు కూడా తమ్ముడు పుట్టాడు.


కాలం జరిగిపోతోంది. ఆ కుటుంబంలో చిన్నారి ఒక్కతే ఆడపిల్ల. అందరి ముద్దు మురిపాల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఇంట్లో అందరికి చిన్నారి అంటే చాలా ఇష్టం. పదవ తరగతి వరకు ఆ ఊరిలోనే కలిసి చదువుకున్నారు పార్థు, శరణ్య…


ఇక చదువులు సిటీకి మారాయి.


కాలేజ్ చదువులు. పార్థు శరణ్యలు వేర్వేరు కాలేజ్‌లలో జాయిన్ అయ్యారు.అక్కడేమో హాస్టల్. ఇద్దరు వేర్వేరు హాస్టల్స్ అయినా. అప్పుడప్పుడు కలిసి షాపింగ్‌లు చేసేవారు. డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉండగా. ఒకరోజు శరణ్యను కలవడానికి వెళ్లిన పార్థుకు. కాలేజ్ బయట ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది శరణ్య.

దగ్గరికెళ్తే… ఆ అబ్బాయిని పార్థుకు పరిచయం చేసింది. అతని పేరు “తన్విక్” అని. తన్విక్ తన స్నేహితురాలు గీతకు అన్నయ్య అని.


ఇక తరువాత తరువాత శరణ్యలో చాలా మార్పులు మొదలయ్యాయి. నిజానికి “తన్విక్” శరణ్యను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. తన్విక్ తన ప్రేమను చెప్పినపుడు శరణ్య ఆలోచనలో పడింది. టైం తీసుకుంది. తన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని తన్విక్‌కు “నో” చెప్పడం పెద్ద సమస్య కాదు. కానీ తన్విక్ గీతకు అన్నయ్య. గీత, శరణ్యల స్నేహం చెడకూడదు కాబట్టి తన్విక్‌తో స్నేహితులుగా ఉందామని చెప్పింది .


కానీ, రోజు రోజుకి శరణ్య కొద్దీ కొద్దిగా తన్విక్ పట్ల ఆకర్షితురాలయింది. కొద్దిరోజుల్లోనే శరణ్య తన్విక్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుండి తనకు తెలీకుండానే పార్థును కలవడం తగ్గించేసింది. పార్థు ఎప్పుడు శరణ్యను కలుద్దామని వెళ్లినా పొడి పొడిగా తక్కువగా మాట్లాడేది. పార్థుకు శరణ్య లో మార్పు కనిపిస్తోంది .


అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయాయి. రేపు హాస్టల్ వేకెట్ చేసి వెళ్లిపోయే రోజు. పార్థు ముందు రోజే హాస్టల్ ఖాళీ చేసి తన లగేజ్ ఫ్రెండ్‌తో ఇంటికి పంపేశాడు. ఇక శరణ్య కోసం హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు.హాస్టల్లోఎంక్వయిరి చేస్తే ఉదయమే హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని హాస్టల్ వార్డెన్ అన్నారు.


ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది. ఇంటికి ఫోన్ చేద్దాం అనుకుంటుండగా. పార్థు దగ్గరికి గీత వచ్చింది..


“పార్థు.. శరణ్య ఇంటికి వెళ్ళలేదు” అంది.


“మరి ఎక్కడుంది. కనిపించట్లేదు. అన్నాడు…


“మరి.. శరణ్య.. మరేమో” అంటుంటే


పార్థు లో కంగారు పెరిగింది.


“శరణ్య. ఇక్కడే దగ్గరలో పార్క్‌లో వెయిట్ చేస్తోంది. నిన్ను తీసుకురమ్మని పంపింది అంది.


వెంటనే పార్థు గీతతో కలిసి దగ్గర్లోని పార్క్‌కు వెళ్ళాడు.



ఒక బెంచిపై శరణ్య. తన్విక్ చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారు.



పార్థు వెళ్ళగానే శరణ్య పార్థుకు దగ్గరగా వస్తూ “పార్థు. నువ్వొక హెల్ప్ చేయాలి” అంది.


“హెల్ప్ తర్వాత.. ఇంటికెళ్దాం పద. మరలా బస్‌లు దొరకవు. ఇంట్లో తిడతారు ” అన్నాడు.


“నేను ఇంటికి రాను. గీతతో వెళ్తా. తన్విక్ నేను ఉదయం గుళ్లో పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి ” అంటూ ఏదేదో చెప్తోంది ఏ బెరుకు లేకుండా.


“నీకేమైన పిచ్చా. పెళ్లిచేసుకోవడం ఏంటి. జోక్ చేస్తున్నావా” అన్నాడు.


“జోక్ ఎందుకు చేస్తా. సీరియస్‌గానే చెప్తున్నా. నాకు తన్విక్ అంటే ఇష్టం.” అంది.


పార్థులో భయం.. బాధ.. ఎలా చెప్తే శరణ్య ఆగిపోతుంది. ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది? ఎలా సర్ది చెప్పి తనతో తీసుకెళ్లడం. అనుకుంటుంటే..


“బాయ్ పార్థు. ఇక నేనా ఇంటి గడప తొక్కను” అంది.


ఇక బాధ ఏమో కాని కోపం పట్టలేక పోయాడు పార్థు. శరణ్య చెంపపై లాగి కొట్టాడు.


“పిచ్చి పిచ్చిగా ఉందా. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా? నా మీద నమ్మకంతోనే నిన్ను ఇక్కడ ఉంచారు. ఇప్పుడేమో నువ్వు ముక్కు మొహం తెలియనోన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయేంత పెద్ద దానివైపోయావు. అసలు పెళ్లి చేసుకునే వయసా నీది? అది కూడా స్వతంత్రంగా. అసలు అత్తయ్య, మామయ్యకు చెప్పావా? ఆడిగావా? వీణ్ణి పెళ్లి చేసుకుంటానని?? కనీసం ఇంట్లో నీ ప్రేమ విషయం కూడా తెలీదు. ఎలా మారిపోయావ్ ఇలా.” అంటూ కోపంతో ఊగిపోయాడు పార్థు.


గుండెల్లో బాధ. ఉబికి వస్తున్న కంట నీరు.. తుడుచుకుంటూ.”శరు. నిన్ను వేడుకొంటున్నా. మా చిన్నారివి కదూ. వచ్చెయ్. వెళ్లిపోదాం. ఈ విషయం తెలిస్తే ఇంట్లో తట్టుకోలేరు. నీ కాళ్ళు పట్టుకుంటా ” అంటూ దీనంగా బతిమాలాడు.


“పార్థు. అర్థం చేసుకో. నేను తన్విక్‌ను పెళ్లి చేసుకున్నా. ఇక రాను. ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఎవరేమైన అయిపోని. నన్ను క్షమించు” అంటూ తిరిగి చూడకుండా తన్విక్‌తో కలిసి వెళ్ళిపోయింది.


పార్థు ఏ నాడు అంత బాధ ను అనుభవించి ఉండడు. ఇంత శోకం. మదిని మెలిపెట్టే బాధ. ఇంటికి ఫోన్ చేసాడు.‌ జరిగిన విషయం ఇంట్లో చెప్పాడు.


ఇల్లంతా శోక సంద్రం. ఇరుగు పొరుగు మాటలు. గుసగుసలు. బంధువుల పలకరింపులు. సింహంలా హుందాగా గౌరవంగా తిరిగే శరణ్య తండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి కూతుర్ని బతిమాలాడు. వేడుకున్నాడు తిరిగి వచ్చేయమని.


ఎట్టి పరిస్థితిలోనూ కుదరదని తెగేసి చెప్పింది శరణ్య. స్టేషన్‌లో శరణ్య మాటే నెగ్గింది. తన్విక్‌తో వెళ్ళిపోయింది. శరణ్య తల్లి. బంధువులు ఎందరు ఆపినా శరణ్య ఎవర్ని లెక్క చేయకుండా తన్విక్‌తో వెళ్ళిపోయింది.


దిగులుగా ఇంటికొచ్చిన శరణ్య తండ్రి నెల రోజులు కూడా తిరక్క ముందే గుండె పోటుతో మరణించాడు. ఆ ఇంట్లో శరణ్య చేసిన పనితో ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలి తమ వ్యాపారాలను వేరే ఊరులో ఏర్పాటు చేసుకున్నారు.


కాలక్రమంలో రెండు సంవత్సరాలు గడిచి పోయాయి


ఈ రెండేళ్లలో పార్థు శరణ్యను మరిచిందే లేదు… ఏ పని చేస్తున్నా. మనసులో శరణ్య ఎలా వుందో.. బాగుందో లేదో.. ఇలాంటి దిగులు.


ఒక రోజు పార్థు స్నేహితుడు అరుణ్ పార్థును కలిసాడు.


“పార్థు. నీకో విషయం చెప్పాలి. ఈ మధ్యనే నేను తన్విక్‌ను చూసాను ఎవరో వేరే అమ్మాయితో . విచారిస్తే తన్విక్ మీ శరణ్యను ఎప్పుడో వదిలేసాడంట. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు”అన్నాడు అరుణ్ .


ఒక్క క్షణం మౌనంగా మారిపోయాడు పార్థు. వెంటనే ” రేయ్.. చిన్నగా మాట్లాడు. ఇంట్లో వాళ్ళు వింటారు. నేను ఇప్పుడే మన ఊరు వస్తున్నా” అంటూ అరుణ్‌తో పాటు బయల్దేరాడు పార్థు.


తన్విక్ పని చేస్తున్న ఆఫీస్ దగ్గరకెళ్లి అందరి ముందు తన్విక్‌ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ బయటకు ఈడ్చుకొచ్చాడు పార్థు.


“ఎక్కడరా శరణ్య. ఏం మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావురా. బంగారం లాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావ్. మా కుటుంబం మొత్తాన్ని రోడ్డుకీడ్చావ్. ఇప్పుడేమో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్. అసలు ఆడపిల్లను పోషించలేక వద్దు అనుకోవట్లేదు రా. నీ లాంటి వెధవల వల్ల వచ్చే ఇబ్బందులకు భయపడే కనట్లేదేమో” అన్నాడు పార్థు.

href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi3rM5Syg1mGjNzIqYnwKY3qCsY7TvhZXaO0yb5wsNKOhlp1hTa-vIns7PoqtsKvF4dhEOzwM8g9veIO3WonW25izTg5E12wHVUlKUghQM-itc1tT3QAjMaH-NXvHzxxHb1Zlqqf1BmOEPCGdLsla99dKYnTELo14RYbgXHOZzeEG4mrv8kb9L553zW/s390/14-sQWmigpwj-transformed.webp" style="display: block; padding: 1em 0; text-align: center; ">

అప్పుడే అదే ఆఫీస్‌లో పని చేస్తున్న పార్థు ఒకప్పటి క్లాస్‌మేట్ శ్రుతి. పార్థుని చూసి అక్కడి విషయం అర్థమైంది.


“పార్థు.. శరణ్య ఎక్కడుందో నాకు తెలుసు. అలా కూర్చుని మాట్లాడుదాం” అంటూ దగ్గర్లోని కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడ చెప్పడం మొదలెట్టింది.


“శరణ్య తన్విక్‌ను పెళ్లి చేసుకుని వీళ్ళ కుటుంబంలోకి వచ్చాక చాలా సమస్యలు ఎదుర్కొంది. తన్విక్‌కు డ్రింకింగ్, స్మోకింగ్, అమ్మాయిల పిచ్చి.. లేని బాడ్ హ్యాబిట్ లేదు. విపరీతంగా కొట్టేవాడు. అనుమానం కూడా ఎక్కువే. ఒకరకంగా శాడిస్ట్. అదీ కాక తన్విక్ తన ఫ్రెండ్‌కు శరణ్య ఫోన్ నెంబర్ ఇచ్చి శరణ్యను వేధించేలా చేసాడు. చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తన్విక్‌కు సపోర్ట్‌గా ఉండడంతో శరణ్య, తన్విక్‌తో ఆరు నెలల్లోనే విడిపోయి వెళ్ళిపోయింది. గీత కేవలం నిమిత్త మాతృరాలు. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత తన్విక్‌లో చాలా మార్పు. పుట్టింటికి వెళ్ళడానికి మొహం చెల్లదు.అందుకే హైదరాబాద్ వెళ్ళి అక్కడే ఫ్రెండ్స్‌తో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ వర్కింగ్ విమెన్ హాస్టల్‌లో ఉంటోంది. ఇదిగో హాస్టల్ అడ్రస్” అంటూ అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇచ్చింది.


పార్థు మనసంతా బాధతో నిండిపోయింది. ఇన్ని రోజులు శరణ్య సంతోషంగా ఉండి ఉంటుందని పట్టించుకోలేదు. ఇంత జరిగిపోయింది అని మనసులోనే బాధ పడుతూ. శ్రుతికి థాంక్స్ చెప్పి, హైద్రాబాద్‌కు వెళ్లి హాస్టల్ దగ్గర శరణ్యను కలిసాడు.


శరణ్య మొహంలో దిగులు. మునుపటి ఉత్సాహం లేదు. తన తప్పు తెలుసుకొనే సరికి తన కుటుంబానికి తీరని నష్టం జరిగిపోయింది. తన తండ్రి మరణంతో పశ్చాత్తాపం.


అప్పటికే పార్థుతో వచ్చి దూరంగా ఉంటూ గమనిస్తున్న శరణ్య తల్లి.. అత్త సులోచన దగ్గరగా వచ్చారు. కొద్ది సేపు అందరి కళ్ళల్లో కన్నీరు. ప్రేమగా శరణ్యను దగ్గరికి తీసుకున్నారు.


మరలా ఆ కుటుంబంలోకి శరణ్య వచ్చింది. కానీ అప్పటికే తన అనాలోచిత నిర్ణయం వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh0syPgQ1mASRmMprkTnkxiJcuEpuSFhMwjBuIVYWE9sAy1nTxeO_nDqmlfhzYJxAdSN1UufhtIvzQYYtxPDXyjvaIZKOfdKYAJw1N5GZigD6MsnGvFdhVl6HnsY9ohGqDmtWGZz8R2X2O-R3ZDKAKlENHaOduBTBwg2m9qYVTeweoK-EEiIWazlnk0/s612/13-dV54KKe54-transformed.jpeg" style="display: block; padding: 1em 0; text-align: center; ">

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియకపోవచ్చు. కానీ ఆడపిల్ల ఎంచుకున్న వ్యక్తి యోగ్యుడై ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లకు తల్లి తండ్రుల నిర్ణయం ప్రకారం పెళ్ళి జరగడమే ఉత్తమం. తల్లి తండ్రిని ఒప్పించి చేసుకోవడం అత్యుత్తమం.

Post a Comment

0 Comments

Close Menu
#copy peste code #copy peste code