#popad code #popad code కోకిల,....

Ad Code

Responsive Advertisement

కోకిల,....

  

కోకిల,... 

 

 " నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను విదురా? నలుపు రంగు నీకు సెట్ కాదు, బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పినమాట వినవుగా అరిచింది శకుంతల కాలేజీకి బయల్దేరిన 'విదురను చూడగానే.

"ఏ బట్టలేసుకుంటే ఏంటమ్మా! నా -మొహమేం మారుతుందని ? తెలుపు రంగు చేసుకున్నంత మాత్రాన ఈ కాకి రంగు పోయి హంసలా అయిపోనులే" విసురుగా బయటకి నడిచింది విదుర.

 గ్లాస్ డోర్ వైపు అప్రయత్నంగా చూసేసరికి దర్శనమిచ్చిన తన నిలువెత్తు రూపం మరింత  చిరాకు పెట్టించి విదురనీ.



"ఛీ.... తనకున్న శత్రువులందరినీ వరుసలో నిలబెడితే మొదటుండేది  ఈ అద్దమే.  ఇన్నిసార్లలో ఏ ఒక్కసారి కూడా కాస్త అందంగా చూపించలేదు. అయినా దాన్ననుకుని ఏం లాభం? అద్దానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా... మనుషుల్లా."

 "హాయ్ విదురా" ఎదురుగా రేణు, "డ్రాప్ చేయనా?" అంది స్కూటీ ఆపి.

 "ద్యాంక్సే,  టైమైంది" ఒక్క గంతులో స్కూటీ ఎక్కి కూర్చుంది.

"ఏంటి స్పెషల్ గా తయారయ్యావు?"  దీర్ఘం తీసింది రేణు

"అదేం లేదే... ఈ రోజు పేర్వెల్".

 "అందుకేనా ఈ హంగామా?"

"అలాంటిదే " నవ్వుకున్నారిద్దరూ.

రేణుతో మాట్లాడితే మనసుకి ఒక్క రకమైన ప్రశాంతత విదురకి. ఎందుకో గానీ అప్పటివరకూ ఉన్న విసుగూ చిరాకంతా టక్కున మాయమైపోతాయి.

 

"నీకు లైట్ కలర్ బాగుంటుందే విదురా... అదే డైలాగ్ రేణు నోటి నుండి కూడా. "నాకు తెలుసు నేనేం వేసుకోవాలో.... సీరియస్ గా  చెప్పి స్కూటీ దిగి వెళ్లిపోయింది.

'ఎందుకిలా అందరూ వద్దన్నా సలహాలిస్తుంటారు? నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనివ్వచ్చుగా, వాళ్ళు చెప్పినట్టు చేస్తే 'నేనేమైనా దేవకన్యని అయిపోతానా?" తిట్టుకుంటూ ఓమూల కూర్చుంది.

 ప్రోగ్రాం మొదలైంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది పిలిచినా కానీ విదుర ఏ గ్రూప్ లోకి వెళ్లకుండా కపటంగానే ఉండిపోయింది.

"ఎందుకు విదురా నీకంత మొండితనం? మాతో కలిస్తే నకేం నష్టం"  కోప్పడింది స్వాతి.

ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఊరుకుంది విదుర.

"మీతో కలిస్తే - మీరు ప్రతీ నిమిషం దిగే  -సెల్ఫీలలో మెరుస్తున్న మీ ముఖాల మధ్య  దిష్టిచుక్కలా నా ముఖం కనిపించటం ఇష్టం లేదు' అన్న సమాధానం బయటకి చెప్పలేదు.

 అయినా ఈ ఒంటరితనం ఈ రోజు తనకి కొత్తకాదు. ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న ఏకైక నేస్తం. ఆఫ్రికాలో దించాల్సిన దేవుడు పొరపాటున ఇండియాలో పడేసినట్టుండే కారు నలుపు తనకు వదిలించుకోలేని గొప్ప బహుమతి. చిన్నప్పటి నుండే వెక్కిరింతల్నీ, అవహేళనల్నీ అందించిన విలువైన బహుమతి. పసి వయసు నుండే మొదలైన అవమానాలకి ఏడ్చీ, ఉక్రోషపడి, విసుక్కుని చివరకు పట్టించుకోవడం మానేసిన మొండిదానిలా మిగిలిపోయింది.

చిన్నప్పుడైతే పూర్తి జ్ఞానం లేక ' కాకి ఆఫ్రికన్' అంటే ఏడ్చేది. మరిప్పుడు మెదడు పరిపక్వం చెందాక కూడా అలాంటి మాటల్ని  మామూలుగా తీసుకోలేకపోతుందెందుకు?

"హాయ్, ఎపుడో ఉన్నట్టున్నావ్.. పాతాళలోకమా! స్వర్గలోకమా! ధర్మ పలకరింపుకి ఆలోచనల్లోంచి బయటపడింది.

"రెండూ కాదు భూలోకమే "

"అయితే ఆలోచనాలోకం అయ్యుంటుంది. అదేగా నీకు చాలా ఇష్టమైన లోకం! "

"ఏమో?" నవ్వింది మెల్లగా.

"అసలు నీకు మనుషులంటే ఎందుకంత కోపం? ఒంటరితనమంటే ఎందుకింత ఇష్టం? " ఆలోచిస్తూ అడిగాడు.

"బాగా ఆలోచించు, నీ ప్రశ్నలోనే సమాదానముంది."

 ఓ నిమిషం ఆలోచించి తల తిప్పేశాడు తెలియదన్నట్టు.

"ఒంటరితనమంటే ఇష్టం కనుకే మనుషులంటే కోపం, మనుషులంటే కోపం కనుకే ఒంటరితనమంటే ఇష్టం".

అవాక్కయినట్టు చూశాడు. "ధర్మ... "ఇన్ని రోజులూ నీకు కేవలం ఆలోచించడం మాత్రమే తెలుగునుకున్నా కానీ మాటలు కూడా ''వచ్చన్నమాట."

"ఏంటి మీటింగ్?"

అంటూ ప్రెండ్స్ రావటంతో సంభాషణ ముగిసింది.

"ధర్మాకి ఏంటి నీమీద స్పెషల్ ఇంట్రెస్ట్ ? " ఉమ చాలాసార్లు అడిగేది, తనే పట్టించుకోలేదు. తనిప్పటివరకూ చూసిన వాళ్లు రెండే రకాలు. చూడగానే చిరాగ్గా మొహం తిప్పుకున్నవాళ్లూ, అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడి సానుభూతి కురిపించేవాళ్లూ. 'బయటి వాళ్లంతే అనుకుంటే మరింట్లోవాళ్లు... లేవగానే నానమ్మ అక్కని పిలిచి ముఖం చూసేది బంగారుతల్లి అంటూ. నాన్న కూడా బయటికెళ్లేటప్పుడు అక్కనే ఎదురు రమ్మనేవారు. ప్రపంచం రంగుకెందుకంత ప్రాధాన్యమిస్తుంది? ' భారంగా మూలిగింది విదుర మనసు.

 'అయినా రంగొక్కటేనా? మధ్యలో స్పోటకం మచ్చొకటి ఇంకాస్త వికారంగా. ధర్మ స్థానంలో తనుండి తనలాంటమ్మాయి ఎదురుపడితే| స్నేహం చేస్తుందా... అనుమానమే.  ఎవరైనా తమతో ఇంచుమించు సమానంగా ఉండేవారితోనేగా స్నేహమైనా, బంధమైనా కలుపుకోవాలనుకునేది? అయితే తనూ స్వార్థపరురాలే నవ్వొచ్చిందా ఆలోచనకి.

దర్మాకి ఎందుకంత ఇంట్రస్ట్ నేనంటే? ' ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తూ ఫుడ్ సెక్షన్ వైపు నడిచింది.

 

"అదేంట్రా? మన గ్రూప్ అమ్మాయిలంతా నీతో మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటే. నువ్వెప్పుడు చూసినా విదురతోనే మాట్లాడు తుంటావ్? " అడుగుతున్నాడు మురళి. 




ఆ మాట వినగానే టక్కున ఆగిపోయింది విదుర. ధర్మ ఏం సమాధానం చెప్తాడో అని చెవులు రిక్కించింది ఆసక్తిగా.

"వాళ్లు వేరు, విదుర వేరురా .సంవత్సరం నుండీ చూస్తున్నాగా.... తనేదో  డిప్రెషన్లో ఉన్నట్టుంది. ఎవరితోనూ కలవదూ, ఏం మాట్లాడదు. ఆ డిప్రెషన్ కంతా కారణం కలర్ తక్కువని కావచ్చు లేదా తను అందంగా లేదని కావచ్చు. అందుకే అప్పుడప్పుడూ తనని నవ్వించాలని ఏదో ఒకటి మాట్లాడుతుంటాను.

  ధర్మ మాటలు భూకంపం రేపాయి విదురలో. సానుభూతి... అదే సానుభూతి. బాల్యం నుండీ మోస్తున్న సానుభూతి..... అందరినుండి అందుకుంటున్న సానుభూతి.

 

అయితే ఈ సారెందుకో చిత్రంగా తనకి కోపం, బాధా విసుగూ ఏవీ రాలేదు. ఒకరకమైన నిరాసక్తత, ఏంటో అర్ధం కాని నిర్లిప్తత. అంతా అయిపోయినట్లు, ఇంకేం జీవితం లేనట్టు, స్తబ్దంగా అయిపోయింది మనసు.

ఫంక్షన్ పూర్తవకుండానే ఇంటికెళ్లిపోయింది. కానీ మళ్లీ అదే కాలేజీలో ఇంకో నాలుగైదు నెలలు ధర్మాని చూస్తూ... తనన్ని మాటలు గుర్తు చేసుకుంటూ... విసుగ్గా విదిలించింది తలని.

 

"విదురా"

ఉలిక్కిపడి తల తిప్పింది సాయంత్రం కాలేజీ నుండి ఇంటికెళ్తున్న విదుర.

 ఎదురుగా స్కూటీ మీద తన ఇంగ్లీష్ లెక్చరర్ సునయన మేడమ్.

 "గుడ్ మార్నింగ్ మేరమ్" విష్ చేసింది ఆప్రయత్నంగా.

ఉదయం నా క్లాస్ లో  కూర్చున్నావన్నదైనా.గుర్తుందా?

 మౌనంగా ఉండిపోయింది విదుర.

"సరే స్కూటి ఎక్కు, నేను వెళ్లేది కూడా అటువైపే ఆర్డర్ కి తలవంచక తప్పలేదు.

"కాసేపు పార్క్ లో  కూర్చుందామా!" బండి లోనికి పోనిస్తూ అడిగింది సునయన మేడమ్.

 అర్ధం కానట్టు చూసింది విదుర. తన అభిప్రాయంతో పనిలేనట్టు. రెండు టిక్కెట్లు కొని, చోద్యంగా చూస్తోన్న విదుర చేయి పట్టుకుని లోపలికి తీసుకునివెళ్లింది.

 "ఏమైంది విదురా... ఈ నెల రోజుల నుండీ మరీ మౌనవ్రతం పాటిస్తున్నావ్?" సూటిగా అడిగేసింది.

 ' పక్కవాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందేమో? తిట్టుకుంది విదుర చిరాగ్గా.

" అసలేంటీ  నీ సమస్య, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుంటావ్?" మళ్లీ అడిగింది సునయన.

 

"నిజంగా మీకు తెలియటా మేడమ్! నన్ను చూసి కూడా మళ్లీ అడుగుతారెందుకు?"  విసుగుని అదిమిపెట్టి సమాధానమిచ్చింది.

 "రంగు....!" ఆశ్చర్యంగా అంది. "రంగు నీ -సమస్యా? అసలు దాన్నెందుకు అంతలా పట్టించుకుంటావ్?

 

"నేను కాదు..."  అరిచేసింది ఆప్రయత్నంగా, పార్క్ లో ఒకరిద్దరు తల తిప్పి చూశారు. విదుర వైపు.

 

"....పట్టించుకుంటున్నది నేను కాదు మేడమ్, ఈ సమాజం'" నిర్లిప్తంగా చెప్పింది మెల్లగా తేరుకొని..

 

"పిచ్చిదానిలా మాట్లాడకు విధురా?

"అదే అయినా బాగుండేదేమో!" మధ్యలోనే అడ్డొచ్చింది.

 

"అబ్బా..."' తలపెట్టుకుంది సునయన. విదురకెల నచ్చాజెప్పలో అర్థం కాలేదు.

" అయితే నువ్వు బాగుండవని నువ్వే నిర్ణయించుకున్నావా?"

"కాదని మీరు గట్టిగా చెప్పగలరా మేడమ్. చెప్తే ఎవరైనా నమ్ముతారా? వదిలేయండి. జరగనివాటి గురించి మాట్లాడటం వృధా....

"సరే వదిలేయ్, కానీ అందమే బతకటానికి అర్హత?."

" కేవలం బతకటానికి కాదు, అందిరిలా ఆనందంగా బతకటానికి. ఎవరి దగ్గరా తక్కువ కాదని ధైర్యంగా బతకటానికైతే ఖచ్చితంగా అందమే అర్హతని అనుభవం ద్వారా తెలుసుకున్నను".

గుండె లోతుల్లో నుండి వస్తున్నాయా మాటలు భారంగా.

" అయితే రంగులేనివాళ్లు, అందం లేనివాళ్లు, బతకడం లేదా?" సీరియస్ గా అడిగింది సునయన.

" బతుకుతున్నారు, ఇలా నాలానే " నిట్టూర్చింది.

" అదే తప్పు... పూర్తిగా తప్పు. నువ్వనుకున్నట్టు లేదీ ప్రపంచం " సర్ది చెప్పేబోయింది.

మనసునీ, వ్యక్తిత్వమనీ, ప్రవర్తననీ కంటికి కనిపించనివన్ని కాగితాల మీదనే, పుస్తకాల్లోనే.

తనదాకా వస్తే అవన్నీ పక్కన పడేస్తారు. అవసరమయ్యే స్నేహన్నైతే అందించరు కానీ అక్కర్లేని సానుభూతి మాత్రం కురిపిస్తారు.అబద్దం అనండి చూద్దాం" సవాల్ విసిరింది విదుర.

ఏం చెప్పాలో తెలియలేదు సునయనకి.

" కాకికీ, చిలకకి అంత తేడా ఎందుకు చూపిస్తారు? ఎందుకంత వివక్ష?" మరో సవాల్ విసిరింది మళ్లీ.

సవాల్ విసిరింది మళ్లీ.

"థాంక్ గాడ్ ఇప్పుడొచ్చావు దార్లోకి" ఊపిరి పీల్చుకుంటున్న సునయన వైపు అయోమయంగా చూసింది విదుర.

"కాకిలా ఉన్నావంటే ఎవరైనా ఫీలవుతారు. కదా? "

చురుగ్గా చూసింది తప్ప సమాధానం చెప్పలేదు. విదుర.

"మరి కోకిలలా ఉన్నావంటే...?" టక్కున జవాబు చెప్పలేకపోయింది. "రెండూ ఒకే రంగు కదా? కాకి అంటే కామెంట్ చేస్తున్నారనుకుని, కోకిల అంటే కాంప్లిమెంట్ అనుకుంటారెందుకు?

'ఎందుకు?' ఆలోచనలో పడింది విదుర.

"ఎందుకంటే కాకిలో లేని కళ కోకిలలో ఉంది కాబట్టి. అది ప్రపంచం గుర్తించింది కనుకే రంగుతో సంబంధం లేకుండా కోకిలకి ప్రత్యేక స్థానమిచ్చింది. దానికి జన్మతః ఆ టాలెంట్ వచ్చింది. మరి మనకి... ఎన్ని అవకాశాలున్నాయి అభివృద్ధి చేసుకోవడానికి?".

అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది విదుర.

 "ఇప్పుడు నిన్నే తీసుకో... నువ్వు బొమ్మలెంత బాగా వేస్తావు? మాకే ఆశ్చర్యమేస్తుంది. ఈ రోజు గొప్పు స్థాయిలో ఉన్న వాళ్లంతా చూడ చక్కని రూపంతో, మెరిసిపోతున్న రంగుతో ఉన్నారంటావా? అయినా మనమెందుకు వాళ్లని గౌరవిస్తున్నాం. రూపాన్ని బట్టా? లేక వారి స్థాయిని బట్టా? నువ్వుకూడా గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు ఈ రంగు లెక్కలోకే రాదు, దాన్నేవరూ పట్టించుకోరు కూడా."

దీర్ఘలోచనలో పడిన విదురను చూస్తూ ఊపిరి తీసుకుంది గట్టిగా.

"నీ గుండెలమీద చెయ్యేసి నిజం చెప్పు. అద్దంలో చూసిన అన్నిసార్లలో అన్నిసార్లులో నీ ముఖాన్ని చూసి తృప్తిగా నవ్వావు? నిన్ను నువ్వే మనస్పూర్తిగా ప్రేమించలేనప్పుడు- నీ రూపాన్ని నువ్వే ఇష్టపడనప్పుడు- నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్ ఇష్టపడాలనుకోవడం తప్పా కాదా? ముందు నీ రూపాన్ని నువ్వు యధాతరంగా ప్రేమించు. చిన్న చిన్న బలహీనతలకి బాధపడకుండా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలంగా మార్చుకో."

రెప్పవేయకుండా అలానే చూస్తుండిపోయింది సునయన వైపు.

 

ఇప్పటికీ నీ ఇష్టం విదుర! పుట్టుకతో వచ్చిన రంగుని తలచుకుంటూ చచ్చేవరకూ బాధపడతావో లేక ఆ రంగుని అందరూ మరిలిపోయేంత గొప్ప స్థాయికెళ్తావో!" అని అంటుండగానే " గొప్ప స్థాయికే వెళ్తాను. మేడమ్... ఖచ్చితంగా వెళ్తాను" దృఢంగా చెప్పింది. విదుర, ఎంతో ఆత్మవిశ్వాసం ఆ గొంతులో

 

వృత్తికి న్యాయం చేశానన్న ఆనందంతో. వెలిగిపోయింది సునయన పున్నమి. చంద్రుడిలా.

Post a Comment

0 Comments

Close Menu
#copy peste code #copy peste code