తాగుబోతు మరణం,... క్రైమ్ స్టోరీ
సోమవారంనాటికి తేలిపోతుంది..
శ్రీమంత టీమ్ లీడర్ యోగం. శ్యామల్ అమెరికా వెళ్ళటానికి సిద్ధపడటం లేదు. రెండు వారాలుగా
వేచి చూస్తున్న కంపెనీ డైరెక్టర్ సోమవారానికల్లా ఏ విషయం తేల్చి చెప్పమని ఇవాళ అతడికి
అల్టిమేటం ఇచ్చాడు. శ్యామల్ అమెరికా వెళ్లే టీమ్ సీనియర్ అయిన శ్రీమంత టిమ్ లీడర్ కావటం
ఖాయం. శ్యామల్ ఈసారి ఒప్పుకున్నట్టే అనిపించటంతో శ్రీమంతకి కొత్త ఉత్సాహంతో ఆరోజు పని
పూర్తి చేసింది. టైమ్ చూసుకుంటే తొమ్మిది. ఇంటిదారి పట్టింది.
ఔటర్ రింగ్ రోడ్.. వాహనాలు తప్ప మనుషులు కనిపించరు పెద్దగా. యాంత్రికంగా స్టీరింగ్
తిప్పుతున్న శ్రీమంత.. హఠాత్తుగా తూలుతూ నడుస్తున్న మనిషి కనబడే సరికి కంగారు పడి కారు స్లో చేసి, ఆగే లోపలే అతడిని ఢీకొట్టింది. 'అయ్యో' అనుకుంటూ కారుని పక్కగా ఆపి,
భయంగా వెనక్కి చూసింది. కొద్ది దూరంలో రోడ్డు పక్కగా పడిపోయిన ఆ వ్యక్తి తల డివైడర్కి
కొట్టుకున్నట్టుగా ఉంది. రక్తం మడుగు కట్టి కనబడుతోంది. అంతలోనే సర్రున వచ్చి.. పక్కన
ఆగిన వ్యాన్ లోంచి ఇద్దరు మనుషులు దిగి, ఆమె దగ్గరకు వచ్చారు.
'చూసుకోలేదు సర్.. అతడే రోడ్డు మధ్యలో నడుస్తూ..' గబగబా అన్నది శ్రీమంత.
'మేం గమనించాం. ఎవడో తాగుబోతులాగా ఉన్నాడు. మీరు భయపడకండా వెళ్లిపోండి. ఇక్కడే
ఉంటే పోలీస్ కేసులో ఇరుక్కుంటారు. ఆ అబ్బాయిని మేం చూసుకుంటాం' చెప్పాడు ఓ మనిషి భరోసాగా.
కృతజ్ఞతగా ఆ మనిషి వంక చూసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయింది శ్రీమంత.
రాత్రంతా కంటిమీద కునుకు లేదు చిన్నమ్మకి. కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మంలోనే
కూర్చుంది.
ప్రతిరోజూ తొమ్మిదింటిలో ఇల్లు చేరే కొడుకు, రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి తల్లి
మనసు తల్లడిల్లి పోతోంది. తెలతెలవారుతుండగా వచ్చింది 'శ్యామల్ ఆస్పత్రిలో ఉన్నాడు'
అన్న వార్త.
తెల్లవారు ఝామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ వాన్, రింగ్ రోడ్డులో పడి ఉన్న శ్యామల్
శవాన్ని చూసి 'హిట్ అండ్ రన్ కేస్' గా భావించారు. ఆస్పత్రికి చేరవేశారు. అతడు చనిపోయి
దాదాపు ఏడు గంటలు అవుతోందని డాక్టర్లు నిర్ధారించారు. పాదచారులకి అనుమతి ఉండని ఆ రోడ్డు
మీదకి శ్యామల్ ఎందుకు వచ్చాడో పోలీసులకి అంతు చిక్కలేదు. శ్యామల్ కి చెందిన కారు గాని,
బైక్ గాని ఆ ప్రాంతాలలో కనిపించకపోయేసరికి అతడు నడిచే అక్కడకు చేరుకున్నాడని అనుకున్నారు.
సీసీ టీవి పుటేజ్ పరిశీలిస్తే గానీ వివరాలు తెలియవు.
అతడి జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంతో చిన్నమ్మకి ఫోన్ చేశారు. నెత్తి, నోరు బాదుకుంటూ
ఆస్పత్రి చేరిన చిన్నమ్మ.. విగత జీవుడై పడున్న శ్యామల్ ను చూసి స్పృహ తప్పినంత పని
చేసింది.
ఇంట్లో తల్లి, శ్యామల్ తప్ప మరెవరూ ఉండరన్న విషయం తెలుసుకున్న పోలీసులు, శవాన్ని
పోస్ట్ మార్టమ్ కి పంపాక, చిన్నమ్మని, ఆమెతో వచ్చిన నైబర్స్ తో వెనక్కి పంపేశారు. ప్రమాదం
జరిగిన సమయంలో శ్యామల్ బాగా తాగి ఉన్నాడని పోస్టుమార్టమ్ రిపోర్ట్లో తేలింది.
విహిత, శ్యామల్ ని కాలేజీ రోజుల నుంచీ ప్రేమిస్తోంది. అతడికి ఉద్యోగం వచ్చినప్పటి
నుంచి పెళ్లి చేసుకొందామని బలవంత పెడుతోంది. తన కోరిక అన్నతో కూడా చెప్పింది. కోట్లలో
వ్యాపారం చేసే అనుజ్ తన చెల్లెలిని మామూలు ఉద్యోగికి ఇవ్వటం ఇష్టం లేదు.
'నీ పెళ్లి నీ ఇష్టం కాదు. నేను చూసే సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఎవరైనా పెద్ద
వ్యాపారస్తుల కుటుంబంతో సంబంధం కలుపుకుని నా బిజినెస్ పెంచుకోవాలనుకుంటు న్నాను. కాబట్టి
శ్యామల్ ని మర్చిపో' అని హెచ్చరించాడు.
శ్యామల్ మరణ వార్త వినగానే, అనుజ్ హెచ్చరిక గుర్తుకు వచ్చిన విహిత పిచ్చిదైపోయింది.
'శ్యామల్ పార్టీలలో కూడా తాగడు. అటువంటివాడు తప్ప తాగి, రోడ్డున పడడమేంటి? చచ్చినా
నమ్మను. నువ్వే శ్యామల్ ని ఏదో చేశావు' దుఃఖంతో అన్న మీద అరిచింది.
'నీ బాధలో నన్ను అనుమానించటం సహజమే. నువ్వు అతడిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం
లేనంత మాత్రాన అతడికి ఏం జరిగినా బాధ్యత నాదే అవుతుందా? అతడు తాగి కారు కింద పడ్డాడని
పోలీసులే చెప్పారు కదా'
'అదే అసాధ్యమని అంటున్నా.. నువ్వే ఏదో చేశావ్' హిస్టీరికల్గా అరుస్తూ నేరుగా
పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లయింట్ ఇచ్చింది.. శ్యామల్ మరణంలో తనకు అనుమానాలు ఉన్నాయని.
'మీకోసం పోలీసులు వచ్చారు మేడమ్, సార్ పిలుస్తున్నారు' అటెండర్ మాటలతో ఉలిక్కిపడిన
లోపు శ్రీమంత లేచి, గ్రూప్ డైరెక్టర్ క్యాబిన్ కి నడిచింది.
నేరుగా మొదలు పెట్టేశాడు క్రైమ్ బ్రాంచ్ ఎస్. ఐ. వర్మా, 'మీ కొలీగ్ శ్యామల్ని
చంపిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం' అంటూ. శ్రీమంతకి గుండె ఆగినంత పనైంది.
తడారిపోతున్న గొంతుతో 'నేను.. నేను.. అతడిని చంపటమేమిటి?' అంది.
'మీరు బుకాయించి లాభం లేదు. మీ కారుతో అతడిని ఢీకొట్టి, పారిపోయిన దృశ్యం స్పాట్లోని
సీసీ టీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది.'
'అది.. అది.. కేవలం యాక్సిడెంటే. అసలు నా కారు కింద పడినది శ్యామల్ అని కూడా
నాకు తెలియదు'.
'ఓహో.. మరి, యాక్సిడెంట్ చేయగానే కారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి, ఇద్దరు మనుషులతో
మంతనాలు జరిపి, ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయారెందుకు? ఎవరు వాళ్ళు?''
శ్రీమంతకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. 'మీ ప్రమోషన్ కి అడ్డు రాకుండా అతడిని తప్పించారు.
యాక్సిడెంట్ గా చూపితే పట్టుబడనని అనుకున్నారు'
'నో.. అతడు యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడాలని ఆశించాను కానీ అతడు చనిపోవాలని ఎప్పుడూ
కోరుకోలేదు. అంత దుర్మార్గురాలిని కాదు' ఏడుస్తూ చెప్పింది శ్రీమంత,
స్టేషన్ కి తీసుకెళ్లి ఇంటరాగేషన్లో శ్రీమంతని ఎన్ని విధాలా ప్రశ్నించినా, ఆమె
నేరాన్ని అంగీకరించేలా చేయలేక పోయారు పోలీసులు.
పోలీసులు వచ్చారని విని బెదరలేదు అనుజ్. వాళ్ళు మొదలుపెట్టకముందే తానే మాట్లాడాడు,
'గుడ్ మార్నింగ్ ఇన్ స్పెక్టర్! శ్యామల్ మరణానికి నేనే కారకుడినన్న అనుమానంతో మీరు
వచ్చారని ఊహించగలను. నిజం చెప్తున్నాను. శ్యామల్ చావుకీ, నాకూ ఏ సంబంధం లేదు. నా మాట
నమ్మండి. మీరు చెప్తున్న ఆ ఇద్దరూ ఎవరో ఇన్వెస్టిగేట్ చేయండి. మీకు ఎలాంటి సహాయం కావలసినా
నేను సిద్ధం. మీరు నిందితులకు తప్పించుకునే టైమ్ ఇవ్వొద్దు' అంటూ. లాజికల్ గా ఉన్న అనుజ్
మాటలు వర్మ నీ సందిగ్ధంలో పడేశాయి.
తన అసిస్టెంట్ తో కలసి శ్యామల్ ఇంటికి వెళ్ళాడు వర్మ, అన్ని వైపులా విస్తరించిన
హైరైజ్ అపార్ట్మెంట్స్ మధ్యలో మూడొందల గజాల స్థలంలో ఒదిగి ఉంది ఆ డాబా ఇల్లు. 'ఈ స్థలం
డెవలప్మెంట్ కి ఎందుకు ఇవ్వలేదో శ్యామల్!' అనుకున్నాడు వర్మ.
పోలీసులను చూస్తూనే ఏడుపు మొదలు పెట్టింది చిన్నమ్మ. ఆమెని సమాధానపరచటమే సరిపోయింది వర్మ కి.. 'చూడమ్మా, మీరు ఇలా ఏడుస్తుంటే, ఏమీ తేలదు. మీ అబ్బాయిని చంపిన నేరస్తులను
పట్టుకుని, శిక్షించాలంటే, మీరు మనసుగట్టి చేసుకుని మాకు వివరాలివ్వాలి' అన్నాడు.
కొన్ని నిమిషాలకి తేరుకుంటూ 'చెప్పండి బాబూ, నేనేం చేయగలను?' అడిగింది చిన్నమ్మ.
'మీ అబ్బాయికి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? మీ మీద ఎవరికన్నా కోపం, ద్వేషం ఉన్నాయా?'
అడిగాడు వర్మ .
'మేము చాలా చిన్నవాళ్లం బాబూ.. మాకు చుట్టపక్కాల్లేరు, ఆస్తిపాస్తులూ లేవు.
ఇంక శత్రువులు ఎవరుంటారు? వాడికి నేనూ, నాకు వాడూ అంతే. ఇప్పుడు వాడు కూడా..' పెద్దగా
ఏడుస్తూ, ' వాడికి నేనంటే ప్రాణం. ఆఫీస్ వాళ్ళు అమెరికా పంపిస్తామన్నా, ఇక్కడ నేనొక్కదాన్నే
ఉండాల్సి వస్తుందని వెళ్ళనని చెప్పేశాడు. నేనే నచ్చ చెబుతున్నాను.. రెండేళ్లే కదా..
వెళ్ళి రారా అని. ఇప్పుడు శాశ్వతంగా వెళ్లిపోయాడు' గొంతు పూడుకు పోవడంతో ఆగింది చిన్నమ్మ..
మాట మార్చాలన్నట్టు అడిగాడు వర్మ 'ఈ స్థలం డెవలాప్ మెంట్ కి, అపార్ట్
మెంట్స్ వచ్చి, మీకు తోడు దొరికేది, మంచి అపార్ట్మెంట్స్ కూడా దొరికేవి కదా' అని.
'నాకూ, వాడికీ అదిష్టం లేదు బాబూ. వాళ్ళ నాన్న కట్టిన ఇల్లు. ఇరుకు చేసుకోవటం
ఇష్టం లేదు. ఆ విషయమే బిల్డర్ల నుంచి మా మీద చాలా ఒత్తిడిగా ఉంది. ఎవరో పెద్ద బిల్డర్
బెదిరింపులకూ దిగాడు. మా అబ్బాయి లొంగలేదు..'
చటుక్కున ఫ్లాష్ వెలిగింది వర్మ మెదడులో. 'ఎవరు ఆ బిల్డర్?' అడిగాడు.
పేరు చెప్పింది చిన్నమ్మ. నిముషం ఆలస్యం చేయకుండా, వ్యాన్ని 'ఇష్టలోక్ బిల్డర్స్' ఆఫీస్ కి పరుగెట్టించాడు.
'శేట్ ఇక్కడ ఉండరు. బెంగళూరులో ఉంటారు' చెప్పాడు అక్కడున్న మేనేజర్ మురారి.
'ఈ వూళ్ళో బిజినెస్ ఎవరు చూస్తారు?'
అడిగాడు వర్మ. 'నేనే' చెప్పాడు మురారి. 'గాంధీ నగర్ లో ఇష్టలోక్ పార్క్కి,
ఇష్టలోక్ డిలైట్స్కి మధ్య ఉన్న శ్యామల్ అనే వ్యక్తి ఇల్లు కొనేసి, డెవెలప్ చేయాలని
బేరం కోసం తిరుగుతోంది నువ్వేనా?'
'వాడు ఒప్పుకోలేదు' చెప్పాడు మురారి. విసురుగా లేచిన వర్మ తన అసిస్టెంట్ వైపు 'ఇతడిని మన స్టేషన్కి తీసుకురా' అన్నాడు కరకుగా. ఇంటరాగేషన్లో అంత తేలికగా బయటపడని మురారి.. సీసీ టీవీ ఫుటేజ్లో ఉన్న ఇద్దరి ముఖాలు చూపించి, వాళ్ళు ఇతడి పేరు బయట పెట్టేశారని బెదిరించగానే నిజాలు వెళ్లగక్కేశాడు. శ్యామల్కి రెండేళ్ల ఫారిన్ చాన్స్ వస్తోందని తెలిసిన మురారి.. శ్యామల్ విదేశాలకి వెళ్లిపోతే ఇప్పట్లో స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉండదని గ్రహించాడు. ఎలాగైనా ఆ స్థలం కొనుగోలు చేయకపోతే శేట్ అతణ్ని ఉద్యోగం నుంచి పీకేస్తానని బెదిరించాడు. ఫారిన్ వెళ్ళేలోగా శ్యామల్ని తొలగిస్తే, ఏకాకిగా మిగిలే అతడి తల్లి నుంచి స్థలం కొనుగోలు చేయటం సులభం అన్న. ఆలోచనతో పథకం వేసి.. ఇద్దరు అనుచరులతో ఆ పథకాన్ని అమలు చేశాడు మురారి.
కంపెనీలో చురుకుగా పైకి వస్తున్న శ్యామల్ పై అసూయ పెంచుకున్న కొలీగ్స్ వేణు,
శంకర్ ముఖ్యులని తెలుసుకున్న మురారి అనుచరులిద్దరూ తమ పథకానికి సహకరించేలా వేణు, శంకర్
ని ఒత్తిడి చేశారు.
'శ్యామల్ తమ చెల్లెలిని ప్రేమించానంటూ వెంబడించాడనీ, పెళ్లి పేరు ఎత్తేసరికి
వెనుకంజ వేస్తున్నాడనీ, అతడి వ్యక్తిత్వానికి చిన్న మచ్చ తెచ్చి, దారిలోకి తెచ్చుకునే
ప్రయత్నమే ఇది' అని చెప్పారు వాళ్ళు.
తాగుడు బలహీనత ఉన్న వేణు, శంకర్ లు లక్ష రూపాయల ఆఫర్ ప్లస్ మందుకి తేలిగ్గా
తలొగ్గారు.
శుక్రవారం సాయంత్రం ఆఫీస్ కాగానే యూఎస్ వెళ్తున్న సందర్భంగా అభినందన పూర్వక
పార్టీ ఇస్తామని శ్యామల్ని బలవంత పెట్టారు. అలవాటు లేకపోయినా అవకాశం వస్తే ఒకటీ, ఆరా
పెగ్ వేసే బలహీనత ఉన్న శ్యామల్ తటపటాయిస్తూనే అంగీకరించాడు. మందులో మాదక పదార్థాలు
కలిపి తాగించేసరికి అదుపు తప్పిపోయాడు. అతడిని బయటకు తెచ్చి మురారి అనుచరులకి అప్పగించి,
తమ దారిన తాము వెళ్ళిపోయారు వాళ్లు. ఒళ్లు తెలియని స్థితిలో ఉన్న శ్యామల్ని రింగ్ రోడ్
మీదకు తీసుకుపోయి, ట్రాఫిక్ మధ్య దింపేశారు వీళ్ళు. తూలుతూ రోడ్ మీదే తచ్చాడుతున్న
శ్యామల్.. కారు కింద పడటం సహజంగా జరిగిపోయింది. ఇష్టలోక్ బిల్డర్ తేలికగా తప్పుకున్నా
పథకం వేసిన మేనేజర్, అతడి అనుచరులు, వేణు, శంకర్ తగిన శిక్షలతో జైలు ఊచలు లెక్కపెట్టవలసి
వచ్చింది.
Written by,.... పి. వి. ఆర్. శివకుమార్.
0 Comments