సాక్ష్యం ,...
శ్యామల హోటల్ అంతా
కలియ చూస్తుంటే అడిగింది జయంతి 'మంచి హోటల్ కాదా ఇది?' అని.
'బర్ దుబాయ్ ఇదే మంచి హోటల్. మంచి సంగతి పక్కనవెడితే తెల్శినోల్లు
ఉండరు' అంది. శ్యామల కాలు మీద కాలు వేసుకొని చైర్లో వెనక్కి వాలుతూ.
'చాలాసార్లే వచ్చినట్టున్నావ్ ?' జయంతి.
ఆమె అనుమానం గ్రహించిదానిలా నిజం చెప్పింది శ్యామల 'గోపీ
తీస్కొచ్చెటోడు' అంటూ.
ఒక్క క్షణం మౌనం తర్వాత అడిగింది జయంతి ‘టిఫిన్ చేద్దామా?'
అని.
'నువ్వు చేస్తే చెయ్..
నాకు టీ చాలు' అంటూ టేబుల్ కింద పర్స్ పెట్టి డబ్బులెక్క చూసుకుంది శ్యామల.
గమనించి మనసులోనే నవ్వుకుంటూ 'ఏం కావాల్నో చెప్పు' అంది జయంతి.
నిజానికి చాలా ఆకలిగా ఉంది శ్యామలకు. అందుకే మొహమాటం వదిలేసి
తనకేం కావాలో చెప్పేసింది.
'సరే.. ' అంటూ కౌంటర్ దగ్గరకు వెళ్లి అయిదు నిమిషాల్లో టిఫిన్
ప్లేట్స్తో మళ్లీ టేబుల్ దగ్గరకు వచ్చింది జయంతి. ఆమె చేతుల్లోంచి ప్లేట్ అందుకుంటూ
'ఇదే ఫస్ట్ టైమా దుబాయ్ రావడం?' అడిగింది శ్యామల.
కాదన్నట్టుగా తలాడించి 'మా పెళ్లయిన కొత్తలొకసారి వచ్చిన'
అన్నది కుర్చీలో కూర్చుంటూ.
'అప్పటి నుంచీ గోపీ
ఇంతేనా?' అదిగింది టమాటో బాత్ కు అల్లం చట్నీని నంజుకుంటూ శ్యామల.
'ఏమో' అన్నట్టుగా పెదవి విరుస్తూ 'నీకెట్లా పరిచయం?' అడిగింది
జయంతి.
నిట్టూర్చింది శ్యామల. మిగిలిపోయిన అల్లం చట్నీని వేళ్లతో
చప్పరిస్తూ చెప్పింది 'మాది నిజాంబాద్ జిల్లా రెండేండ్ల కిందట నా భర్త చనిపోయిండు.నాకిద్దరు
కొడుకులు.. అయిదెండ్లు, ఎడెండ్లు ' అంటూ ఆగింది.
'చెప్పు' అన్నట్టుగా చూసింది జయంతి. 'మా ఆయనున్నప్పుడూ మాకు
ఆస్తి లేదు. అప్పూ లేదు. కాని ధైర్యం ఉండే. అది పోయినంక ఆ ఊర్లె బతుకుడు కష్టమే అయింది.
ఈడ దుబాయ్ మా పెద్దమ్మ బిడ్డ ఉంటది. దుఃఖంల ఉన్న నన్ను పల్కరియ్యతందుకని ఫోన్ చేసింది
ఒకనాడు. మాట్లాడిన. ఆ బాధల దుబాయ్ ఏమన్నా పనుంటే ఇప్పియ్యు అని అడిగిన. రెండు రోజులకు
ఫోన్ చేసి నా ఫోటో పంపిమ్మన్నది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం ఇయ్యాల్నంటే ముందు మనుషులు
శుభ్రంగా ఉన్నరా లేదా అని చూస్తరు. ఫోటో చూసినంకనే ఓకే చేస్తరు అని చెప్పింది. పంపిన.
మల్లా ఫోన్ చేసి ఉద్యోగం ఖాయమైంది. వాళ్లే ఇండియాలో ఉన్న వాళ్లవాళ్లతో పాస్పోర్ట్,
వీసా అన్నీ చేపిస్తరు మూడు లక్షలు ఖర్చయితయ్ రెడీ పెట్టుకో, టికెట్ కూడా తీస్తున్నం
అని చెప్పింది. నా బంగారం, మా అమ్మ బంగారం కుదవ పెట్టి మూడు లక్షలు రెడీ పెట్టుకున్న.
పాస్పోర్ట్ చేపిచ్చిండ్రు. వీసా వచ్చింది. మా అమ్మోలింటి కాడ పిల్లల్ని వదిలిపెట్టి
ఈడికి వచ్చిన' అంటూ ఆపి నీళ్లగ్లాస్ అందుకుంది.
'టీ తీసుకొస్తా' అంటూ జయంతి మళ్లీ కౌంటర్ దగ్గరకు వెళ్లింది.
రెండు టీ కప్పులతో వచ్చేటప్పటికి శ్యామల కళ్లల్లో నీళ్లు
కనిపించాయి జయంతికి. ఏం మాట్లాడకుండానే టీ కప్పు ఆమె చేతికిచ్చింది జయంతి.
సిప్ చేస్తూ అన్నది శ్యామల 'నాకే ఉద్యోగం లేదని ఇక్కడికొచ్చినంక
తెల్సింది. అప్పటికే గోపీకి మా పెద్దమ్మ బిడ్డకు సంబంధం ఉందనీ అర్థమైంది. నా ఫోటో అడిగింది
గోపి. వాడు..” అని తమాయించుకుని 'సారీ.. అతను' అంటూంటే 'పర్లేదు' అన్నట్టు కళ్లతోనే
చెప్పింది జయంతి. కంటిన్యూ చేసింది శ్యామల.
'నన్ను పిలిపించమన్నది గోపీనే. ఆయన తాన మా అక్క చేసిన బాకీ
మాఫీ చేస్తా అనే సరికి నన్ను పిలిపించింది ఉద్యోగం దొరికిందని. తీరా నేను వచ్చినంక..
చూసిన ఉద్యోగం పోయింది.. ఇంకోటి చూస్తున్నమని నన్ను నమ్మించి గోపీ రూమ్ల పెట్టింది
మా అక్క. నా పైసలు తీస్కొని ఏజెంట్ ఉడాయించిండని, నాకోసం గోపీ బగ్గ కష్టపడ్తున్నడని..
ఇంకోకాడ ఉద్యోగం కోసం లక్షన్నర కట్టిండని.. ఉద్యోగం దొర్కంగనే ఆయన పైసలు ఆయనకియ్యాల్నని
చెప్పుడు మొదలువెట్టింది మా అక్క. గిసుంటి మాటలతో, నా అంతట నేను గోపీ వశమయ్యేటట్టు
చేసిండ్రు. ఇద్దరు కల్పి. ఈ విషయం నేనచ్చిన ఆర్నెల్లకు గానీ తెల్వలే. తెల్సి లొల్లి
పెట్టేటప్పటికి ఆయనతోని ఉన్న నా వీడియోలు చూపిచ్చిండ్రు. ఎక్వతక్వ గాయ్ చేస్తే ఆ వీడియోలను
మా అత్తగారోల్లకు, అమ్మోల్లకు పంపుతమని బెదిరిచ్చిండ్రు ఇద్దరూ. ఆ రోజు నుంచి గోపీ
శకలే మారిపోయింది. లక్షన్నర కాక అన్ని రోజులు తిండివెట్టినందుకు ఇంకో లక్ష రూపాయలేషిండ్రు.
దానికి వడ్డీ సూత కలిపి మూడు లక్షలు కట్టమని.. లేకుంటే ఆయన చూపిచ్చినోల్ల తానికి పోవాల్నని
బలవంతం చేసుడు. పోను అంటే బెల్ట్ ని కొట్టుడు.. చూడు' అంటూ వెనక్కి తిరిగి వీపు చూపించింది
శ్యామల.
ఆమె కుర్తీ హుక్స్ రెండు తీసి వెనక నెకన్ను కొంచెం కిందకి
లాగి చూసింది జయంతి. ముదురు ఎరుపు రంగులో కమిలిపోయిన మచ్చలు కనపడ్డాయి. వెంటనే హుక్స్
పెట్టేసి 'సర్దుకొని కూసో.. ' అంది చిన్నగా.
చున్నీ కప్పుకుంటూ ముందుకు తిరిగింది శ్యామల. మళ్లీ ఆమె కళ్లనిండా
నీళ్లు.
మా ఊర్లే ఇంత ఇజ్జతన్నా ఉండేది. ఇక్కడన్నీ వొయినయ్. పుట్టెడు
అప్పులు మిగిలినయ్. గోపీ దగ్గర్నుంచి ఎల్లిపొయొచ్చి ఒక దోస్త్ దగ్గర ఉంటున్నా. ఆమెనే
రెండిండ్లల్ల పని సూపిచ్చింది. ఆడికీ వచ్చి సతాయిస్తున్నడు. ఆమెనూ నోటికొచ్చినట్టు
తిడ్తుండు. నేను పనిచేసే కాడా నా వీడియోలు చూపిస్తనని బ్లాక్మెయిల్ చేస్తుండు. ఎంచేయాల్నో
తెల్వక నీకు ఫోన్ చేసిన. గోపీ ఫోన్లోంచే దొంగతనంగా నంబర్ తీస్కొని చెప్పింది
శ్యామల. 'కండ్లు దుడ్సుకో' అంది జయంతి ఆమె భుజం నొక్కుతూ.
'నువ్వు రాకపోతే సచ్చుడే గతనుకున్నా' కళ్లు తుడుచుకుంటూ శ్యామల.
తన పర్స్ లోంచి ఫోన్
తీసి శ్యామల ముందు పెట్టింది జయంతి.
'అరే.. గిది గా గోపీగాడి ఫోనే కదా' అంటూ ఆ ఫోన్ తీసుకుని
గబగబా గ్యాలరీలోకి వెళ్లి వీడియోలు వెదికింది శ్యామల. కనపడ్డాయ్.
'ఆయన మీద కంప్లయింట్ ఇస్తున్నా. అవసరమైతే సాక్ష్యానికి వస్తవా?'
అడిగింది జయంతి.
"ఊ "
అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది శ్యామల.
Written by సరస్వతి రమ...
0 Comments