మసక దారీ,...
'ఇతర ఇయ్యకుండనే
ఇంటికిపోతున్న. అమ్మ, బాపు, తమ్ముడు ఎట్లున్నరో? అనిత... ఏమంటదో? పట్టుకొని ఏడుస్తదా?
మా ఇంటికాడ ఉందో.. ఆల్ల అమ్మోల్ల ఇంటికాడ ఉందో? గ్వి ఆలోచనలు..షార్జాల విమానం ఎక్కినప్పటి
నుంచి. ఒకటా.. రెండా.. అయిదేండ్లాయే మరి.
పెండ్లయిన నెలకే షార్జా వీసా తగిలింది. కరెంటు పనికి. లక్కీలవడ్డవ్
అన్నరందరూ. ‘రాకేషూ.. అంత పోషమ్మ తల్లి దయరా. గీ యేడాదిల అక్క పెండ్లికి జేసిన అప్పు
దీరిపోతే.. అవ్ .. అక్కెట్లుందో.. నేను దుబాయ్కి వొయ్యేటైమికి నీళ్లువోసుకుంది. కొడుకో,
బిడ్డనో? అసలిప్పుడెంతమంది పిల్లలో? అక్క అప్పు దీరిపోతే అటెన్కలు సంపాదనతోని పసుపు
చేను కొందాం. ఆర్మూర్ల పసుపు మార్కెట్ అయితదట. ఒక్క నాలుగేండ్లు కష్టవడు కొడ్కా.. సాలు.
తర్వాత అందరం కల్శి మన చేన్లనే పనిజేసుకోవచ్చు. కుటింబం ఒడ్డున వడ్డది కొడ్కా... అని
పోషమ్మ పండగ నాడు నా గద్వ వట్టుకొని చెప్పింది అమ్మ కండ్లనిండా నీళ్లు దీస్కుంట. అర్రే...
నా కండ్లెందుకు మాగురైతున్నయ్? జేబులకెంచి దస్తీ తీసుకని తుడ్సుకున్న. అమ్మ యాదికొచ్చినప్పుడల్లా
గిట్లనే దుఃఖంతోని గుండె బరువైతది.. కండ్లు మాగురైతయ్.
అమ్మనే కాదు.. అనిత యాదికొచ్చినా గిదే పరిస్థితి. పెండ్లయిన
మాటనే గని కల్కి ఉన్నట్టే లేదు. అస్సలు నా మొఖంల మొఖంపెట్టి సరిగ్గా చూసిందో లేదో.
పోశమ్మకు పెట్టుకున్ననాడు.. రాత్రి అన్నది 'షార్జా అద్దు ఏమద్దు ఈడ్నే ఉండు' 'అని.
'యేడాదిల అస్త' అన్న తన చెయ్యి వట్టుకుంట. 'మల్లా పోవా ఇగ అన్నది కండ్లల్ల సంతోషం నింపుకుంట.
'అప్పులెల్లాలే. పొలం కొనుక్కుందాం. ఇల్లు మంచిగ చేయించాలే. మనకు బెడ్రూమ్ అద్దా?'
అన్న. సిగ్గువడ్డది. కాని పొల్ల... మస్తు బాధపడ్డది. బస్సెక్కినంక కిటీకీల కెంచి మరి
మర్లి జూసిన, బస్సు కనవడకుండా వొయ్యేదాకా ఆడే నిలవడ్డది. పెండ్లి తర్వాత మా ఇంటికాడ
నోము, ఆల్లింటికాడ నోము, మా అక్కోల్ల అత్తగారింట్ల దావత్, ఆల్లింటికాడ భోజనం,నా వీసా
కోసం అటుర్కుడు, ఇటుర్కుడుతోని నెల రోజులు అయ్యేపాయే. పాల్లతో మాట్లాడినట్టు లేదు..
కల్ని తిర్గినట్టూ లేదు. ఫోన్ జేస్తవ్ కదా.. చేస్తావ్ కదా.. అని ఎన్నిసార్లు అడిగిందో!
గవన్నీ యాదికొస్తే దుఃఖమే.
తమ్ముడైతే అమాయకుడు. నేను పక్కనుంటెనే ధైర్నంగుంటడు. బావ
హుషారితనం తెలినంక బాపు మస్తు అల్లరవడ్డడు. 'నువ్వు వోతున్నవ్. షిన్నోడికేం దెల్వదు.
మీ బావతో ఎట్లేగిచ్చుడో? దునియల లేని కానూన్లు మాట్లాడే గాయనతోని గెలుస్తమా?' అన్నడు.
'మరి పోను తియ్ బాపు.. ఈడ్నే కష్టపడి అప్పులు దేరుపుతా'అన్న. 'అద్దు. పో. ఓ నాలుగేండ్లు
కష్టపడితే అయ్యేదానికి ఈడ పదేండ్లు కష్టపడాలే. ఎన్నొద్దులు మా అప్పులు నీ నెత్తి మీద
మోసుకుంటవ్ కొడ్కా. పో.. ఒక్క నాలుగేండ్లు సాలు' అనుకుంట అలుముకున్నడు బాపు.
ఆ ఆశలు, కలలన్నీ ఉశ్కెనే అని తేలినయ్.. షార్జా ఎయిర్పోర్టుల
అడుగుపెట్టుడికే. కరెంటు పనిలేదు గిరెంటు పనిలేదు. ఎయిర్పోర్ట్ కెంచి నన్ను కొండవొయ్యి
ఎడార్ల వడేసిండ్రు. ఆడ రెండేండ్లు.. ఎట్లున్ననో గా దేవుడికే తెలుసు. గొర్రెలు కాసిన
ఎండల మాడిపోయిన. బయట
లోకంతో సంబంధమే తెగిపోయింది. నరమానవుడు కనవడితే ఒట్టు. ఎప్పుడో
ఒక్కసారి హర్బాబ్ అస్తుండే. గాయన హర్బాబ్ అన్న సంగతి సూత నాకు తెల్వలే. ఆడ్నించి పారిపోయేటప్పుడు
తెల్శింది. పాకిస్తానాయన నన్ను ఆడినుంచి బయటపడేసి పుణ్యం కట్టుకున్నడు. లేకపోతే నా
గతమైతుండెనో. ఇంటోళ్లకు ఒక్క ఫోన్ లేదు. ఉత్తరం లేదు. కనీసం తాను ఎయిర్పోర్ట్ మంచిగనే
దిగిన అన్న కవరు సుత అంటలేదు ఆళ్లకు. అనిత తాన ఫోన్ లేకుండే. ఈడికి రాంగనే ఫస్ట్ జీతంల
కెంచి పైసలు పంపిస్తా.. ఫోన్ కొనుక్కో అని చెప్పిన. 'అన్నా... వాచ్ పంపుతావానే నాకు'
అని నోరిడి అడిగిండు తమ్ముడు. పంపిస్తరా అని తల నిమిరిన. గంతే. మల్లా మాట్లాడలేదు.
ఏమనుకున్నరో.. ఏమనుకుంటున్నరో? ఎన్ని కష్టాలు? ఓలకు చెప్పుకోతందుకు
లేదు. ఎడార్ల నుంచి తప్పించుకొని ఆఫ్గనిస్తానోల్ల గుంపుల జేరితి. ఆల్లతోనే దుబాయ్ దాటి
మస్కట్ వోయిన దొంగ దారిల. ఎంత దిక్కు మల్లె రాతకాకవోతే.. ఆల్లందరికీ మస్కట్ల మంచి పనిదొరికితే
నాకు ఆడ సుత గొర్రెల పనే దొరికే. తప్పించుకోతందుకు మల్లా రెండేండ్లు వట్టే. ఈసారి మల్లా
దుబాయికి రాతందుకు పాపం.. ఒక ఆడివిల్ల సాయం చేసింది. బుట్టేసి టాక్సీలోకూసోవెట్టి బార్డర్
దాటిచ్చింది.
గీ ఒక్క యేడాదే జెర్రంత
బతికిన్నేమో. ఆర్నెల్ల సంది ఇంటోల్లతోని మాట్లాడతందుకు మస్తు ట్రై చేస్తున్న. మా బాపు
నంబర్ ఒక్కటే గుర్తుకున్నది. అది కలుస్తనే లేదు. వేలసార్లు చేసుంట. నేనున్న జాగ పేరు
పూజి అట. ఆడ మా ఊరోల్లు ఒక్క సూత కానరాలే. కరీంనగరోల్లు, ఆదిలాబాదోల్లు మస్తుమందే ఉండే.
అయినా నాకు పాకిస్తానోల్లు, ఆఫ్గనిస్తానోల్లే దోస్తలయిండ్రు. ఆల్లే పని జూప్పిచ్చిండ్రు.
ఆల్ల రూమ్లనే ఉన్న ఈడికచ్చేదాంక. కరోనా కాలమని ఆమ్నెస్టి వెట్టపటికే గిప్పుడన్నా ఊరి
మొఖం సూడవడితి.
మల్లా నా కండ్లల్ల నీళ్లు.
బస్సాగింది...
ఇద్దరు బస్సెక్కిండ్రు ఆ ఊర్లే.
ఆలుమగలున్నట్లున్నరు. నాకు సూటిగున్న అటు పక్క సీట్లకచ్చిండు
మొగడు. కిటికీ పక్కన పెంట్ తందుకేమో కొంచెం సైడ్కి ఆగిండు. ఆమె కిటికీ దిక్కు పోతుంటే
చూసిన.
ఒక్కసారే పరేషాన్ అయిన. ఆమె సూత నన్ను చూసింది కాని.. ఎర్కలేనట్టే
పొయ్యి కిటికీ సీట్ల కూసున్నది. నా గుండె ఆగిపోయింది. నోరెండి పోయింది.
ఆమె... అనిత.
సీట్ల కూసున్న దగ్గర్నుంచి మొగడితోని ఏవో ముచ్చట్లు చెప్తున్నది.
ఆయన నవ్వుతున్నడు. కిటికీలకెంచి అస్తున్న గాలికి ఆమె వెంట్రుకలు ఎగురుతుంటే సవరిస్తున్నడు.
అసలు ఈ లోకంల ఉన్నట్లేలేరిద్దరూ.
నా మైండ్ మొద్దవారిపోయింది. ఏం తెలుస్తలేదు. ఏం అర్థమైతలేదు.
నా మనిషి ఇంకో ఇంటికి వొయ్యింది. అంటే మా అమ్మ, బాపు... నేనిగా రాను అనుకున్నరా? సచ్చి
పోయిన అని ఒక చిత్తం చేసుకున్నరా? మల్లా నా కండ్లు మాగురైతున్నయ్ నిండా నిండిన నీళ్లతోని.
0 Comments